జనాలు మంచోళ్ళు

మొన్న శీనుగాడు కాలేజి గ్రంథాలయానికి వెళ్ళాడు.

శీను గాడికి వాళ్ళ అమ్మ చెప్పేది, ఎప్పుడూ జనాలంటే ఇష్టముండాలని. ఉగ్గుపాలతో పెట్టింది కాబట్టి శీనుగాడికి జనాలంటే నిజంగానే చాలా ఇష్టం ! ప్రపంచం చెడ్డదని తెలుసు కానీ దానిని జీర్ణుంచుకొనే శక్తి లేదు. జీర్ణంచుకోగలిగినా, జనాలంటే ఇష్టంలేని ప్రపంచంలో బతక లేడు కాబట్టి జీర్ణించుకోడు. దానికి వ్యతిరేకమే నిజం అని నిరూపించడానికి అప్పుడప్పుడూ చాలా విచిత్రమైన పనులు చేస్తూంటాడు.

ఉదాహరణకు, వాడొకసారి బెంగుళూరు దగ్గర కృష్ణరాజపురం రైలు నిల్దాణ బయట నుండి లోపలికి రెండు పెద్ద పెట్టెలు తీసుకువెళ్ళాల్సుంటే. వాడేం చేసాడో తెలుసా ?
ముందు కూలీ కోసం చూసాడు. దొరకలేదు. జనాలు మంచి వారని నిరూపించడానికి ఇదే మంచి అవకాశమని, వాడు ఒక పెట్టెని బయట రోడ్డు మీద వదిలేసి, ఇంకోదాన్ని లోపలికి తీసుకువెళ్ళి, దానిని అక్కడ వదిలేసి బయటకు వచ్చి రోడ్డు మీద దానిని లోనికి తీసుకువెళ్ళాడు. రోడ్డుమీద పెట్టెనీ ఎవరు ఎత్తేయలేదు, స్టేషన్లో ని పెట్టెనీ ఎవరూ ఎత్తేయలేదు. వాడి నమ్మకం ఋజువయ్యింది. ఎంతయినా పెట్టెల్లో వాడి పాస్పోర్టు మరియు వచ్చేవారం అమెరికాకి పై చదువులకి వెళ్ళడానికి కావలసిన వీసా ఉన్నాయి.

అది జరిగి రెండు సంవత్సరాలయ్యింది. మళ్ళీ ఆ విషయాన్ని నిరూపించే సమయం దగ్గర పడింది.
గ్రంథాలయంలోని ఎప్పుడూ వెళ్ళని ఓ కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి చదువుకునే బల్ల దగ్గర చదువుకుంటున్నాడు. శీను అక్కడికి వెళ్ళగానే, అతను, మీ దగ్గర ఫోన్ ఉందా? నేను దానినొకసారి వాడుకోవచ్చా అని అడిగాడు. శీనుగాడు సంతోషంగా ఫోన్ తీసి ఇచ్చాడు. మాటలో మాట అన్నట్టు మనోడు అతనిని, ఇక్కడ దగ్గరలో మూత్రాలయం ఎక్కడ ఉంది? అని అడిగాడు. దానికతను, “దగ్గరలో లేదు, ఆ పక్క వింగులో ఉంది” అని బదులిచ్చాడు. మనోడు, “సరే నేనక్కడికి వెళ్ళి వస్తాను, నా బ్యాగ్ కాస్త చూస్తావా?” అని అడిగాడు. అతను సరే అన్నాడు.

మనోడు తాపీగా మూత్రం విడిచి వచ్చే సరికి అక్కడ బేగ్గూ లేదు, ఫోనూ లేదు, మనోడి సరికొత్త ప్రాణనేస్తమూ లేడు. మనోడికి నమ్మసఖ్యం కాలేదు.  ‘బాగ్ బరువుగా ఉందని దానితో పారిపోయాడేమో’ అనే సందేహం వచ్చింది గాని, ఊహుఁ, అసంభవం!
‘ఓ..’ ఇప్పుడ అర్థమయ్యింది, ‘అతను ఎవరికో కాల్ చేసుంటాడు, వారికి సీరియస్ గా ఉండుంటుంది, ఇతను వెంటనే వెళ్ళాల్సివచ్చి వెళ్ళపోయింటాడు. అంతే అయ్యింటుంది కచ్చితంగా…’

క్రిందికి వెళ్ళి గ్రంథాలయ ముఖద్వారం దగ్గర గార్డుని అడిగాడు,

         ఇక్కడ ఎవరైనా బేగ్ గాని ఫోన్ గాని వదిలి వెళ్ళారా ?
         ఫోను వదల్లేదు గాని ఇదిగో ఈ కాళీ బేగ్ వదిలి వెళ్ళింది ఒక అమ్మాయి.
         ప్చ్ అది నాది కాదు, నా బేగులో లాప్ టాప్ ఉంటుంది.
         ఔనా ? నోటీసు చూడలేదా ? లాప్ టాప్ ని వదిలేసి వెళ్ళకూడదు!
         హుఁ
         పోలిసుల్ని పిలవమంటావా ?
         వద్దు , అతనికి కాల్ చేస్తాలే. పర్లేదు.

మనోడు కాల్ చేసి మెసేజ్ వదిలాడు, ఎప్పటికైనా తన లాప్ టాప్ మరియు ఫోన్ తిరిగి వస్తుందని నమ్మకంగా ఉంది. కాని ఉద్యోగం వెతుక్కునే సమయం కాబట్టి లాప్ టాప్ మరియు సెల్ లేక పోవడం నిజంగా దురదృష్టకరం.

కానీ జనాలు మాత్రం మంచోళ్లు.

Published in: on జూన్ 11, 2007 at 3:16 ఉద.  వ్యాఖ్యానించండి  

The URI to TrackBack this entry is: https://trinetram.wordpress.com/2007/06/11/5/trackback/

RSS feed for comments on this post.

వ్యాఖ్యానించండి